స‌ర్వే రాయుళ్లు.. 'మీ ఓటు' ఎవ‌రికి ..!


ANDRAPRADESH: దీనిని ఎవ‌రు చేయిస్తున్నారు? ఎవ‌రు చేస్తున్నార‌న్న‌ది మాత్రం గోప్యంగా ఉంచారు. పైకి ఎక్క‌డా ఎవ‌రూ చ‌ర్చించ‌డం కూడా లేదు. ఏపీలో గ‌త రెండు రోజులుగా కీల‌క‌మైన ఓ స‌ర్వే సాగుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. మీరు ఎవరికి ఓటే స్తారు? అనేది ఈ స‌ర్వే సారాంశం. ఇవి ఐవీఆర్ ఎస్ స‌ర్వేలు. రోజుకు ఒక ఫోనుకు రెండు సార్లు ఈ కాల్స్ వ‌స్తాయి. రెండు సార్లు కూడా.. ఒక్క‌టే ప్ర‌శ్న‌. అదే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. మీరు ఎవ రికి ఓటే స్తారు? అనే. దీనిని ఎవ‌రు చేయిస్తున్నారు? ఎవ‌రు చేస్తున్నార‌న్న‌ది మాత్రం గోప్యంగా ఉంచారు. పైకి ఎక్క‌డా ఎవ‌రూ చ‌ర్చించ‌డం కూడా లేదు.


కానీ, క్షేత్ర‌స్థాయిలో ఫోన్ల‌కు మాత్రం(అది బ‌ట‌న్ ఫోన‌యినా.. స్మార్ట్ ఫోన్ అయినా) కాల్స్ వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా సంతృప్తి తెలుసు కునేందుకు ప్ర‌భుత్వ‌మే స‌ర్వేలు చేయించింది. పింఛ‌న్లు, ఉచిత గ్యాసు స‌హా ఉచిత ఇసుక‌.. మ‌ద్యం ఇలా.. ప‌లు అంశాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం స‌ర్వేలు చేయించింది. ఈ ప‌రంప‌ర‌లోనే ఇప్పుడు మీ ఓటు ఎవ‌రికి అంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు.

దీనిలో రెండే ఆప్ష‌న్లు ఉంటున్నాయి. 1) కూట‌మి ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి కోరుకుంటే 1 నొక్కండి. లేక‌పోతే .. 2 నొక్కండి! అనే వాయిస్ వినిపిస్తోంది. అయితే.. దాదాపు అంద‌రూకూడా దీనిని రిజెక్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉత్సాహంతో ఉన్న వారు కూడా.. స‌ర్వేల్లో పాల్గొన్న వారు కూడా.. ఇప్పుడు వ‌స్తున్న ఓట్ల స‌ర్వేపై మాత్రం కినుక వ‌హిస్తున్నారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) అస‌లు ఈ స‌ర్వే ఎవ‌రు చేస్తున్నారనేది తెలియ‌క‌పోవ‌డం. 2) ఏం స‌మాధానం చెబితే ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యం.

సాధార‌ణంగా ఇలాంటి స‌ర్వేలు వ‌చ్చిన‌ప్పుడు.. ప్రభుత్వానికి అనుకూలంగా నొక్కేస్తే.. ఇబ్బంది లేద‌ని భావిస్తారు. కానీ, ఈ ద‌ఫా అలా కూడా ప్ర‌జలు స్పందించ‌డం లేదు. థ‌ర్డ్ పార్టీ ఎవ‌రు? అనేది వెతుకుతు న్నారు. పోనీ.. స‌మాధానం 2 అని నొక్కితే.. వ‌స్తున్న ప‌థ‌కాలు ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు మౌనంగా ఉంటున్నారు. ఇదిలావుంటే.. ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు.. దీనిని ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏడాది పాల‌న‌పై ప్ర‌జాభిప్రాయం తెలుసుకునేందుకు ఇలా చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి దీనిలో నిజ‌మెంతో కానీ.. ప్ర‌జ‌లు మాత్రం ఇప్ప‌టికిప్పుడు స్పందించ‌డం అయితే.. త‌గ్గించేశారు.