ఉన్మాది, చీడపురుగు.. ఆర్జీవి ఒళ్లు దగ్గరపెట్టుకో.. మళ్లీ కొలికపూడి మాస్ వార్నింగ్


వ్యూహం సినిమా వివాదంలో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ కంప్లయింట్ మేరకు టీడీపీ సానుభూతిపరుడు, అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు ఏపీలోని సీఐడీ అదికారుల విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ టెలివిజన్ షోలో మాట్లాడుతూ.. ఆర్జీవి తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల పారితోషికం ఇస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన సీఐడీ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..

ఆర్జీవి ఫిర్యాదు చేసినందున్న గుంటూరులోని ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాను. ఉన్మాది.. సమాజానికి పట్టిన చీడపురుగు రాంగోపాల్ వర్మ నాపై పెట్టిన కేసుతో సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందించి విచారణకు హాజరయ్యాను. 5 గంటలపాటు నన్ను పలు రకాల ప్రశ్నలు అడుగుతూ విచారించారు అని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

రాంగోపాల్ వర్మతో వ్యక్తిగతం నాకు వైరం లేదు. అతడు తీసే సినిమాలపై, అతడు తీసిన సినిమాల కారణంగా సమాజంలో హింస ప్రవృత్తి, మహిళలపై అసభ్యంగా వ్యవహరించే తీరు.. ఆయన సినిమాల వల్ల సమాజంపై పడే దుష్ప్రభావంపై నాకు కొన్ని తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి అని కొలికపూడి చెప్పారు.

ఇటీవల రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా, ఆ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో, ఆ సినిమా వేడుకల్లో ఏపీలోని రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, సామరస్యతను దెబ్బ తీసే విధంగా వ్యవహరించాడు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఓ కులాన్ని, చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు టీడీపీ గురించి, వారి కుటుంబాలకు సంబంధించిన మహిళల గురించి చెడుగా మాట్లాడటంపై తీవ్రంగా వ్యతిరేకించాను అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.

రాంగోపాల్ వర్మ వ్యవహరించే తీరుపై కలిగిన ఆవేదన నుంచి కలిగి ఆయనపై ఓ మాట మాట్లాడాను. నా ఆవేదనను అర్ధం చేసుకొనే వారికి నా ఆలోచన అర్ధం అవుతుంది. నన్ను విమర్శించే వారికి అది నేరంగా కనిపిస్తుంది. నాపై కేసు పెట్టిన తర్వాత రాంగోపాల్ వర్మకు కాల్ చేసి నా అభిప్రాయాన్ని చెప్పాలని ప్రయత్నించాను. కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. కావాలంటే ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాను. కానీ ఆయన నాతో మాట్లాడటం లేదు అని కొలికపూడి తెలిపారు.

విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు చెప్పిన ప్రకారం.. తొలిసారి ఆర్జీవి భయపడ్డారు. ఇక నుంచైనా మంచి సినిమాలు తీయాలి. సమాజానికి కీడు చేసే సినిమాలు తీస్తే ఇలాంటిదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఈ వ్యవహరంలో నాకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తున్నాను అని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.